Sunday, August 31, 2008

నవతరంగం లక్ష పేజీల మైలు రాయిని దాటిన సందర్భంగా

నవతరంగంలో విజయవంతంగా ఎనిమిది నెలలు గడిచాయి.ఈ నెలలో నవతరంగం లక్ష పేజీల మైలు రాయిని దాటిన సందర్భంగా అందరికీ మరో సారి ధన్యవాదాలు.

వచ్చే నెల (సెప్టెంబర్)లో నవతరంగం లో విశేషాలు:

ఫోకస్ - ఈ నెల డబుల్ బిల్

బాపు: గతంలో ప్రకటించినట్లుగా ఫోకస్ శీర్శిక డేవిడ్ లీన్ మీద కాకుండా బాపు మీద చేయాలనుకుంటున్నాము.సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డ్ అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, శ్రీ బాపు తన కదలని, కదిలే బొమ్మలతో ఎనలేని భావాలను అలవోకగా ప్రకటించినా, తన సినిమాల గురించి అరుదుగా మాట్లాడే ’మితభాషి.’ మొదటిసారిగా తన చిత్రాల సిత్రాలను పాఠకుల ముందు పరుస్తున్నారు. ఆస్వాదించండి.....

తపన్ సిన్హా: భారత ప్రభుత్వం సినీ కళాకారులకు అందచేసే అత్యుత్తమ పురస్కారం ’దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ 2006 సంవత్సరానికి గాను ప్రముఖ బెంగాలీ/హిందీ చిత్ర తపన్ సిన్హా కు ఇస్తునట్టుగా ప్రకటించిన సందర్భంగా ఆయన గురించే కాకుండా ఆయన సినిమాలతో కూడిన వ్యాసాలను కూడా ప్రచురించబోతున్నాము.

ఈ నెల సినిమా - ఇది కూడా డబుల్ బిల్లే!

వచ్చే నెల లో ప్రతినెల లాగే ’ఈ నెల సినిమా’ శీర్షికన ఒక మంచి సినిమాను పరిచయం చేయాలనుకుంటున్నాము. కానీ నెలంతా ఒక్క సినిమానేనా అనిపించే వారికి ఈ నెల నుంచి ’ఈ నెల సినిమా’ శీర్షిక ఈ నెల సినిమాలుగా మార్చి రెండు సినిమాలు పరిచయం చేయాలనుకుంటున్నాము. ఈ నెల సినిమాలు:

ముంబయ్ మేరీ జాన్:గతంలో తన తొలి చిత్రమైన ’డోంబ్లివిల్లి ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో ఎన్నో చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలందుకున్ననిషికాంత్ కామత్ దర్శకత్వంలో వచ్చిన ’ముంబయ్ మేరీ జాన్’ సినిమా ఈ నెల సినిమాలో మొదటిది.

టైమ్స్ అండ్ విండ్స్: ఈ మధ్య ఎక్కడ పట్టినా సినీ విమర్శకుల నోట బాగా నలుగుతున్న ఒక టర్కిష్ సినిమాని మన తెలుగు వాళ్లకీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ నెల సినిమా శీర్షికలో పరిచయం చేయబోతున్న రెండో సినిమా ’టైమ్ అండ్ విండ్స్’

మిగిలినవి:ప్రపంచ సినిమా ఉద్యమాల శీర్షికన భావవ్యక్తీకరణ వాదం సీరీస్ లో ఇప్పటికే రెండు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. ఈ నెలలో భావవ్యక్తీకరణ వాదపు సినిమాలలో ముఖ్యమైన ’The Cabinet of Dr Caligari', 'M' మరియు 'Nosferatu’ సినిమాల పరిచయమే కాకుండా ఆ సినిమాలను వీక్షించే అవకాశం కూడా కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నాము.

ఇవి కాకుండా ఇప్పుడు జరుగుతున్న వెనిస్ చలనచిత్రోత్సవం మరియు సెప్టెంబర్ లో జరిగే టొరాంటొ చలన చిత్రోత్సవం విశేషాలు కూడా పొందుపరుస్తాం. ఇవి కాకుండా ఎప్పటిలాగే కొత్త సినిమా సమీక్షలు, విశ్లేషణలు కూడా ప్రచురిస్తాము.

పైన పేర్కొన్న విభాగాలలోనే కాకుండా సినిమాకి సంబంధించిన ఏ అంశం మీదనైనా మీరు వ్యాసాలు రాసి పంపితే నవతరంగంలో ప్రచురిస్తాము.

-- శిద్దారెడ్డి వెంకట్

1 comment:

Anil Dasari said...

ఎనిమిది నెలల్లో లక్ష పేజీలెలా రాసేశారండి బాబు! లక్ష పేజీలా లేక లక్ష హిట్లా?