Tuesday, October 21, 2008

మాన్ సూన్ వెడ్డింగ్ చూద్దామా


బిగ్ ఫేట్ పంజాబ్బీ వెడ్డింగ్ నేపధ్యంలో న్యూ ఢిల్లీ లో తీసిన సినిమా.. మీరా నాయర్ దర్శకురాలు ! వెడ్డింగ్ అన్న మాట పేరులో చూసి, ఇదేదో డాన్సూ, పాటలూ, సరదా, సంబరం లాంటి ఎలిమెంట్స్ మాత్రమే నింపకుండా, మంచి కధ లా తీసిన, చెక్కగా, సున్నితంగా సాగిపోయే సినిమా ఈ మోన్సూన్ వెడ్డింగ్ !

సాధారణంగా పెళ్ళిళ్ళను ఎంతో రొమాంటింక్ గా.. ఎంతో సంతోషంతో - అందరు పాత్రలూ, పాత్రధారులూ సంబరంగా జరుపుకునే ఈవెంట్ లాగా తీస్తారు సినిమాల్లో. అదే సందర్భంగా పెళ్ళింట్లో, పట్టుచీరల రెపరెపలు, ఫెళ్ళుమని ఖర్చయిపోయే రూపాయలూ, పందిళ్ళూ, బాజాలూ, బాజంత్రీలూ, పెట్టుపోతలూ, కృత్రిమమో, నిజమో గానీ బోల్డన్ని ఆప్యాయతలూ, అనురాగాలూ ఆర్భాటంగా ప్రదర్శితమయ్యే సందర్భం - పెళ్ళి. మోన్సూన్ వెడ్డింగ్ - అడావుడిగా ముప్ఫయి రోజుల్లోనే షూట్ చేసిన పకడ్బందీ సినిమా. మీరానాయర్ లాంటి దర్శకురాలూ, థియేటర్ నుంచీ వచ్చిన మెఱికల్లాంటి నటీనటులూ, మరీ ఆర్టు మూవీలాగా కాకుండా, భలే సరదాగా - గమ్మత్తయిన కధనం తో, జీవితపు అన్ని పార్శ్వాలనూ స్పృసిస్తూ తీసిన ఈ సినిమా ఒక తప్పకుండా చూసి తీరాల్సిన ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమా.



సినిమా.. ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేపధ్యంలో మొదలవుతుంది. తంబూ వాలా (పెళ్ళి పందిరి వేసే వాడు / కాంట్రాక్టరు), పనిమనిషీ కూడా మన ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు! ఈ పాత్రలకి సినిమా ప్రధాన ప్లాట్ తో ఏ సంబంధం లేకపోయినా, మన జీవితాల్లో ఇతరుల జీవితాల కలబోత స్పష్టంగా, క్యూట్ గా చూపిస్తారు దర్శకురాలు. ఒక పారదర్శకత తో - కొత్త భారతీయ జీవితాన్ని చూడండి - ఆధునికత, ప్రాచీనత, విలువలూ, నాగరికతా, ఇవన్నీ, కలగలిసిపోయి, ఫేషనబుల్ యువత, సెక్స్ - దోపిడీ - ఇలా అన్నీ కలగైసిపోయి, నేటి మన జీవితాన్ని మన ముందు అందమయిన ప్లేటర్ లో చెక్కగా పేర్చి కొందరి కధల్ని కలగలిపి (ప్రతీ పాత్ర కీ ఒక కధ ఉంటుంది, ప్రతి ఫ్రేం చూడతగినది) అందంగా వొడ్డించిన వంటకం ఈ మోన్సూన్ వెడ్డింగ్.


http://navatarangam.com/2008/10/monsoon-wedding/

No comments: